3 స్టార్టప్స్‌లో ఫెయిల్. ఇప్పుడు 1000 కోట్ల టర్నోవర్‌ టార్గెట్. మేడిన్ ఆంధ్రా కుర్రాడి సత్తా.

, , No Comments


మొబైల్ రీచార్జ్ చేసుకున్నప్పుడు కొన్ని సమస్యలు ఎదురు కావడం సర్వసాధారణం. ఎయిర్టెల్ మొబైల్ వాడే వారికి బిఎస్ఎన్ఎల్ రీచార్జ్ చేయడం కష్టం అవుతుంది. దీంతో పాటు ఎప్పుడైనా బిల్లు కట్టేటప్పుడు క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి బహుశా మనందరికీ ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే ఉంటుంది. ఇలాంటి సమస్యలు భవిష్యత్ లో ఉండకూడదని అనుకున్నారు కిరణ్. దానికి పరిష్కారం చూపే ప్రయత్నం నుంచి మొదలైన స్టార్టప్ నంబర్ మాల్. సాధారణ బిల్ పేమేంట్ అప్లికేషన్‌తో పోలిస్తే నంబర్ మాల్ నూటికి నూరుశాతం మెరుగైందంటున్నారు ఫౌండర్ సిఈఓ కిరణ్ కుమార్ గాలి. “దేశ జనాభాలో సుమారు వందకోట్లమందికి అవసరమైన సేవలను మేం అందిస్తున్నాం. ఇలాంటి సేవా రంగంలో ఉన్నందుకు గర్వంగా ఉంది” కిరణ్ నంబర్ మాల్ ప్రధాన వినియోగదారులు సాధారణంగా బిల్ పేమెంట్ చేసే కస్టమర్లే. అంటే మనమంతా బిల్ పే చేయాలన్నా, రీచార్జ్ చేయాలన్నా మనందందరం ఈ సేవలను వినియోగించుకోవచ్చన్నమాట. నంబర్ మాల్ ప్రారంభం 2012లో హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైంది నంబర్ మాల్. సాధారణ రీచార్జ్‌లు చేసే ఓ టూల్‌లా మాత్రమే జనం ముందుకొచ్చిన ఈ స్టార్టప్ ఇప్పుడు 300 కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది. నంబర్ మాల్ వ్యవస్థాపకుడు కిరణ్ సొంతూరు ప్రకాశం జిల్లా. వెకేషన్ కోసం ఊరెళ్లినప్పుడు తన స్నేహితుడి షాప్‌లో చూసిన సమస్యకు పరిష్కారం కనిపెట్టాలనుకున్నారు. అలా మొదలైందే నంబర్ మాల్. ఆ రోజు షాప్‌లో మొబైల్ రీచార్జ్ చేస్తున్నప్పుడు చూసిన సమస్య అది. ఆన్‌లైన్ వ్యాలట్ లాంటిది రీచార్జ్ కోసం ఉంటే బాగుండు అనుకున్నారు కిరణ్. ఏ నెట్వర్క్ అయినా ఆ మొబైల్ వ్యాలెట్‌తో పేమెంట్ చేసుకునే సౌలభ్యం ఉండాలని డిజైన్ చేశారు. ఈ పరిష్కారం ఇప్పుడు ఏరకమైన సమస్యకైనా ఓ బ్రహ్మాస్త్రంలా మారిపోయిందంటే ఆశ్చర్యం లేదేమో. మొదటి ఫెయిల్యూర్ ఇంత గొప్ప కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన కిరణ్ బ్యాక్‌గ్రౌండ్ ఓ సారి చూస్తే.. మూడు స్టార్టప్‌లను ప్రారంభించి ఫెయిలైన ఓ ఫెయిల్యూర్ ఆంట్రపెన్యువర్ కనిపిస్తాడు. వాటన్నింటి నుంచి ఎన్నో నేర్చుకుని.. ఇప్పుడు సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. '' ఎంబియే ఫైనల్ సెమిస్టర్ ఫీజు కట్టకుండా, ఆ డబ్బులతో కంపెనీ ప్రారంభించా '' - కిరణ్ అది 2001వ సంవత్సరం. అప్పుడు ప్రారంభించిన కంపెనీ జాబ్ పోర్టల్. ఢిల్లీ కేంద్రంగా ఇది మొదలైంది. అయితే అదొక అట్టర్ ఫెయిల్యూర్ స్టార్టప్ అని ఆయనే చెప్తారు. ఏ రకంగానూ నిలదొక్కుకోలేక మూసేయాల్సి వచ్చింది. ఐడియా ఉండి ఎగ్జిక్యూషన్ లేకపోవడం ఏంటో అప్పుడు నాకు అర్థం అయిందంటారు కిరణ్. ఇక వ్యాపారం మన వల్ల కావడం లేదని కొన్నాళ్లు దూరం పెట్టాలనుకున్నారు. ఉద్యోగం చేస్తే సాధక బాధకాలు తెలుస్తాయని గ్రహించారు కిరణ్. హైదరాబాద్ చేరుకొని జస్ట్ డయల్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా తన కెరియర్ ప్రారంభించారు. దాదాపు మూడేళ్లు ఆ ప్రస్థానం కొనసాగింది. మరో రెండు ఫెయిల్యూర్స్ 2005 వరకూ సక్రమంగా కెరియర్ కొనసాగుతున్న కాలంలో మరో సారి స్టార్టప్ ప్రారంభించడానికి ముందుకొచ్చారు కిరణ్. అయితే కిరణ్ అప్పుడొక స్టార్టప్ కంపెనీలోనే పనిచేస్తున్నారు. వర్కింగ్ వీజా కంపెనీ అది. పూర్తిగా టెక్నాలజీ బేస్డ్ కంపెనీ కావడంతో ఎండ్ టు ఎండ్ ఎక్స్‌పీరియన్స్ సాధించారు కిరణ్. ఇంతలోనే మరో కంపెనీ ప్రారంభించారు. దాదాపు ఏడాది కాలంపాటు ఇలా రెండు కంపెనీలల్లో 10లక్షలు నష్టపోయారు. ఇక వ్యాపారం మనకు అచ్చిరాదు అనుకుని బలంగా ఫిక్స్ అయిపోయారు. చివరకు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మళ్లీ జాయిన్ అయిపోయారు. ఉద్యోగం జీవితం సాఫీగాసాగిపోయింది. చివరికి సక్సస్ “ ఇన్ని సార్లు ఫెయిల్ కావడం బహుశా ఫెయిల్యూర్‌కి కూడా నేను బోర్ కొట్టానేమో. నా నుంచి దూరంగా జరిగింది. వెంటనే విజయం నన్ను వరించింది. అయితే దీని కోసం నేను చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది” - కిరణ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుండగా విప్రో నుంచి పిలుపొచ్చింది. జాయిన్ అవుదామా లేదా అన్న డైలమాలో ఉన్న సమయంలో ఓ క్లెయింట్ హ్యాండిల్ చేయమంటే.. ప్రారంభమైందే వర్టికల్ ఎక్స్‌పోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. నంబర్ మాల్‌కి పేరెంట్ కంపెనీ ఇది. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు కిరణ్. నంబర్ మాల్ అనేది ఇప్పుడు మాస్ జనాల నోళ్లలో నానుతున్న బ్రాండ్. రీచార్జ్ దగ్గర నుంచి కరెంట్ బిల్ దాకా ఏ సేవకైనా ఒకే సైట్‌లో పరిష్కారం ఇస్తుంది. ఓ రెవల్యూషన్ స్మార్ట్ ఫోన్లు మొదలైన శకంలోనే నంబర్ మాల్ కూడా పుట్టుకొచ్చింది. అప్పటికి ఇంకా ఆండ్రాయిడ్ ఫోన్లు రాలేదు. అప్పుడు మొదలైంది వర్టికల్ ఎక్స్‌పో టెక్. స్మార్ట్ శకం రాగానే అది నంబర్ మాల్‌గా రూపాంతరం చెందింది. ఆఫ్ లైన్ కస్టమర్లకు ఆన్ లైన్ సేవలను అందించడం నంబర్ మాల్ ప్రధానం లక్ష్యం. ఇలా ఫోన్ ద్వారా అన్న సేవలకు, సమస్యలకూ పరిష్కారం చూపించడం ఓ రకంగా ఈ హైదరాబాదీ కంపెనీ ఘనతగానే చెప్పాలి. “ఒకే యాప్ టెక్నాలజీతో అన్ని నెట్వర్క్‌ల రీచార్జ్‌లు చేయాలని అనుకున్నా. అలాంటి ఆలోచన రాను రానూ ఆన్ లైన్లో ఓ సేవాకేంద్రంగా మారింది ” - కిరణ్ నంబర్ మాల్ టీం నంబర్ మాల్ టీం విషయానికొస్తే కిరణ్ కుమార్ గాలి ఫౌండర్ సిఈవో. ఐఐపిఎం నుంచి ఎంబిఏ పూర్తి చేసిన కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కిరణ్ భార్య జ్యోతి కూడా నంబర్ మాల్‌లో కో ఫౌండర్. ఆమెతోపాటు మరో ముగ్గురు కో ఫౌండర్లున్నారు. వీరితో పాటు 40మంది ఆన్ రోల్ ఉద్యోగులున్నారు. ఆఫ్ లైన్ లో 500లకు పైగా టీంఉంది. దేశ వ్యాప్తంగా నంబర్ మాల్ కి సేవా కేంద్రాలూ ఉన్నాయి. ఫండింగ్ అండ్ పెర్ఫార్మన్స్ నంబర్ మాల్ 2015 ప్రధమార్థంలో శ్రీ క్యాపిటల్ నుంచి రూ. 5 కోట్ల ఏంజిల్ ఫండింగ్ పొందింది. ప్రస్తుతం సిరీస్ ఏ ఫండింగ్ కోసం చర్చలు జరుపుతోంది. సిరీస్ ఏ కింద రూ. 60 కోట్లు సమీకరించే యత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక దశలో 2014లో రూ. 120 కోట్లకు కంపెనీని మొత్తం చేజిక్కించుకునేందుకు ఓ సంస్థ ఆఫర్ ఇచ్చింది. అయితే వేల్యుయేషన్ మరింత పెంచడంతో పాటు ఓ అతిపెద్ద వ్యవస్థగా సంస్థను తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్న కిరణ్.. ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. కంపెనీ ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే రూ. 37 కోట్ల టర్నోవర్ సాధించిన నెంబర్ మాల్.. ఆ తర్వాత ప్రతీ ఏడాదీ అనూహ్యమైన వృద్ధిని కనబరుస్తూ వస్తోంది. 2014-15లో రూ.100 కోట్ల టర్నోవర్ పొందిన కంపెనీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన టార్గెట్‌ను రూ.1000 కోట్లకు నిర్దేశించుకుంది. నలుగురితో మొదలైన సంస్థ ఇప్పుడు 30 మంది కీలక సిబ్బందితో వేగంగా పావులు కదుపుతోంది. ప్రస్తుతం నెంబర్ మాల్‌లో ఐఐటి,ఐఐఎం సహా ప్రముఖ టెలికాం కంపెనీల్లో ఉన్నతోద్యోగాలు చేసిన ఎంతో అనుభవం పొందిన సిబ్బంది ఉన్నారు. 15000 రిటైల్ పార్ట్‌నర్స్ ద్వారా 10 రాష్ట్రాల్లో 2.5 కోట్ల మందికి సేవలు అందించింది నెంబర్ మాల్. రాబోయే మూడేళ్లలో భాగస్వాముల సంఖ్యను 4 లక్షలకు పెంచాలనే లక్ష్యంతో దూసుకుపోతోంది. కాంపిటీటర్స్ నంబర్ మాల్ స్పేస్‌లో కాంపిటీటర్లు ఎవరూ లేరు. ఈజీ రీచార్జ్ లాంటి కంపెనీలు కొన్ని సేవలు అంటే రీచార్జ్, డిష్ రీచార్జ్ లాంటి సేవలకే పరిమితం అయ్యాయి. పేటియం లాంటి పేమెంట్ గేట్ వేలు పేమెంట్లతో అటాచ్మెంట్ చేసుకున్నాయి. ఈ రెండింటికి మధ్య ఉన్న గ్యాప్‌ని నంబర్ మాల్ ఫిల్ చేస్తుంది. అందుకే నంబర్ మాల్‌కి కాంపిటీటర్లు లేరని చెబుతున్నారు కిరణ్. భవిష్యత్ ప్రణాళికలు మా స్పేస్ లో అనుకున్న సేవలన్నింటినీ అందుబాటులోకి తీసుకొచ్చాం. సరికొత్త ప్రాడక్టులను లాంచ్ చేయాల్సి ఉంది. ఫండింగ్ వస్తే మరిన్ని వినియోగ సేవాకేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు కిరణ్. నంబర్ మాల్ అంటే ట్రస్ట్ ఫ్యాక్టర్. ఇదే బ్రాండ్‌లో భవిష్యత్‌లో ఫండ్ ట్రాన్స్‌ఫర్‌ని కూడా తీసుకు రావాలని అనుకుంటున్నాం. ఆఫ్ లైన్ కస్టమర్లకు మరిన్ని ఆన్ లైన్ సేవలను అందించాలని చూస్తున్నామన్నారు కిరణ్. మా కస్టమర్లు ఆఫ్ లైన్ కస్టమర్లే. ఆన్ లైన్ కస్టమర్ల కోసం ఎన్ని సేవలు వచ్చినా ఆఫ్ లైన్ కస్టమర్ల సంఖ్య ఎప్పటికీ తగ్గదు. అది ఎవర్ గ్రీన్. ఆ కస్టమర్ ఉన్నంత వరకూ నంబర్ మాల్ ఉంటుందని ముగించారు కిరణ్.
Website:
www.numbermall.com

Source:
http://telugu.yourstory.com/read/4f87788db9/3-startapslo-fail-1000-crore-turnover-target-now-andhra-boy-able-to-be-made-

0 comments: